Skip to main content

1. ఒక మహోన్నత విశ్వ విజేత

                ఒక మహోన్నత విశ్వ విజేత 

నువ్వు గొప్పవాడివి అని నువ్వైనా నమ్ము :

“ప్రపంచం నువ్వు గొప్పవాడివి అయ్యాకనే గుర్తిస్తుంది.కానీ ఈ ప్రపంచం గుర్తించక ముందే నీకు తెలుసు నువ్వు ఖచ్చితంగా గొప్పవాడివి  అని ”

ఈ ప్రపంచంలో నువ్వు రెండు చేయగలవు – ఒకటి నువ్వు విలువైన వాడివని నీకు నువ్వు నిరూపించుకోవడం , నువ్వు విలువైన వాడివని ఇతరులకు నిరూపించడం. 

నువ్వు విలువైన వాడివని నిన్ను నువ్వు నమ్మించుకోవడం అంటే – నీ సెల్ఫ్ వర్త్ ని నీ దృష్టిలో పెంచుకోవడం. నువ్వు విలువైన వాడివని ఇతరులను నిరూపించడం అంటే.. నీ నెట్ వర్త్ ని పెంచుకోవడం. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి.. నీ సెల్ఫ్ ఎస్టీమ్ ఆధారంగా నువ్వు గొప్పవాడివని.. నువ్వు నమ్మవచ్చు. కానీ ప్రపంచం మాత్రం నీ సక్సెస్ ని చూసి మాత్రమే నువ్వు గొప్పవాడివని,విలువైన వాడివి అని నమ్ముతుంది.

అసూయ ,ఆత్మన్యూనత లేనిదే నిజమైన జీవితం :

“ నువ్వు గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే.. నీ గొప్పతనాన్ని చూసి అసూయపడే వారి నుంచి బయటకు రావాలి. నీ గొప్పతనాన్ని గుర్తించి,గౌరవించే సర్కిల్ లో నువ్వు ఉండాలి.”

ఒకటి – నువ్వు ఒకడిని చూసి అసూయ పడుతున్నావంటే.. నిన్ను నువ్వు ఒకడి కన్నా తక్కువగా భావించుకుంటున్నావు అని అర్థం.ఒకడిని చూసి అసూయపడుతూ బ్రతికితే అలాంటి లైఫ్ వృధా.. ఎందుకంటే..21 వ శతాబ్ధంలో ఎంతో జ్ఞానం,నైపుణ్యాలు,మైండ్ సెట్,హార్ట్ సెట్,సోల్ సెట్ మెరుగు పరచుకోగలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆత్మ విశ్వాసం,ఎంచుకున్న రంగంలో ఆసక్తి , నేర్చుకోవాలనే తపన ఉంటే ఎవరైనా గొప్పవారు,ప్రపంచం దృష్టిలో విజేతలు కాగలరు.ఒకటి గుర్తుంచుకోండి..చైతన్యం ఉన్న మనుషులకు ఏ స్థాయి భేదాలు ఉండవు కానీ ఎవరి పర్సనల్ స్పేస్, ఫ్రీడం, ఇష్టాఇష్టాలు వారికి ఉంటాయి. ఎదుటివారు మన కన్నా గొప్ప పనులు చేస్తున్నారంటే.. వారి నుండి మనం స్పూర్తి పొందాలి. కానీ అసూయపడకూడదు. అసూయపడటం అనేది జీవితంలో ఎదిగేవారి లక్షణం కాదు. అది అసమర్థుడి లక్షణం.అలాంటి చాతకాని వారి లక్షణాలను మనం పొరపాటున కూడా అనుసరించకూడదు. ఈ భూమ్మీద నువ్వు ఎవరికన్నా తక్కువని అనుకున్నా..అది నీకు అంత మంచిది కాదు.నిన్ను నువ్వు తక్కువగా అనుకోకూడదంటే..నీ కన్నా గొప్ప వ్యక్తుల పట్ల గౌరవం,వినయం లేకుండా ప్రవర్తించమని.. అర్ధం కాదు. నువ్వు వారితో ఉన్నప్పుడు ఆత్మ గౌరవాన్ని,ఆత్మ విశ్వాసాన్ని కలిగి ఉండేలా చూసుకోమని అర్ధం. నీ జీవితంలో నువ్వు ఎదిగే దశలో ఉండి.. నీకంటే ఉన్నతంగా అప్పటికే ఎదిగిన వారిని చూసి ఆత్మ న్యూనత చెందటం సమర్థుల లక్షణం కాదు.సమర్థులెప్పుడూ..ఎదుటి వారి ప్రవర్తనను వ్యక్తిగతంగా తీసుకోరు. వారు వారిలో అప్పటికే ఉన్న మైండ్ బ్లాక్స్ ని క్లియర్ చేసుకుంటారు తప్ప.. నేను తక్కువ.. వారి అంత కాదు అనేటువంటి.. అనవసరమైన మైండ్ బ్లాక్ లను ఏర్పరుచుకోరు. ఈ విషయం గురించి ఒక కవితలో స్పందించినది ఏమిటంటే..

              “నీ స్థాయిలో.. నీ పరిస్థితుల్లో.. 

               నువ్వు సాధించింది కూడా గొప్ప కాదా.. 

               నీ తలపులు,నీ తపనలు 

               నీ కథను మలుపు తిప్పలేదా?”

ఉన్నత ఆశయాలు ,ఉన్నత లక్ష్యాలున్నవారు విజేతలే :

తమ జీవితానికి స్వార్థం మాత్రమే కాక ఒక అర్ధమూ ఉన్న.. ప్రతి ఒక్కరూ  మనలో విజేతలే..తమ గురించి మాత్రమే కాక.. పరుల గురించి  ఆలోచించే ప్రతి ఒక్కరూ మహనీయులే ”

ఒక కోటీశ్వరుడు ఇంకో వంద కోట్లు సంపాదించడాన్ని ప్రపంచానికి ఒక చరిత్ర కావచ్చు కానీ ఒక పేదవాడి విజయాన్ని కూడా  ప్రపంచం సెలెబ్రేట్ చేసుకుంటుంది..నిజమైన గెలుపు అంటే అందరి మనసులను గెలుచుకోవడం.. అసలు నిజానికి పేదవారంటే తక్కువ స్థాయిలో ఆలోచించేవారు అని అర్ధం చేసుకోవాలి. ఎక్కువ స్థాయిలో ఆలోచించేవారు సౌకర్యాలు ఉన్నా లేకపోయినా.. పేదవారు కాదు. జీవితంలో ఉన్నత ఆశయాలు,ఉన్నత లక్ష్యాలు ఉన్నవారు .. పేదవారిగా ఫీల్ అవాల్సిన అవసరం లేదు.నిజానికి సంపదకు అంతులేదు. సంపద సృష్టించడం నిజానికి ఎంటర్ ప్రెన్యూర్ లకు మాత్రమే తెలిసిన ఒక ఆట..కానీ కనీస అవసరాలు నెరవేర్చుకుంటూ.. తమకి చేతనైనంతలో ఉన్నత ఆశయాల కోసం ఎదుటి వారి కోణం నుంచి ఆలోచించి పని చేసే ప్రతి ఒక్కరూ ధనవంతులే. ధనవంతులు కావడం అంటే.. లైఫ్ స్టైల్ ఛేంజ్ అని అర్ధం అనుకుంటారు. మన ఆలోచనలు చిన్నగా ఉన్నంత వరకు ఎన్ని సౌకర్యాలు ఉన్నా.. వారు పేదవారే.. శ్రీ వీరబ్రహ్మం గారు అనే ఒక మహనీయుడు గుడిసె లో ఉండి నేడు భారత దేశం అంతా గర్వంగా చెప్పుకునే మహా కాలజ్ఞాని అయ్యాడు.మనం ఎక్కడ ఉంటున్నాం అనే దాని కన్నా.. మన లక్ష్యం ఎంత గొప్పది.. ఆ లక్ష్యం కోసం పని చేసే విధానంలో మనతో ఎవరు ఉన్నారు అనేదే ముఖ్య విషయం. 

నిన్ను నువ్వు ఆస్వాదించడమే నీ మొదటి విజయం: 

“ నీ మనసు పరిపూర్ణ స్వేచ్ఛలో ఆలోచిస్తే.. నీకు ఏకాంతం ఒక వరమవుతుంది, నీ జీవితం నీ నియంత్రణలోకి వస్తుంది , ప్రపంచం నీ గొప్పతనాన్ని  అంగీకరిస్తుంది , నిన్ను గౌరవిస్తుంది.. అభిమానిస్తుంది ”

ప్రపంచమే ఒక గ్రామంలా మారిపోయిన ప్రస్తుత శకంలో.. ఇంకా తాము  పుట్టింది పల్లెటూళ్ళోనని ఏమి సాధించలేమని అపోహలు పెట్టుకునే వారు ఉన్నారు. అన్ని రకాల అపోహలను, మనపై మనకు ఉన్న అపార్థాలను క్లియర్ చేసుకోవడమే.. మనల్ని మనం ఆస్వాదించడానికి ముందడుగు. ఒక మనిషి ఎక్కడ పుట్టాడు అన్నది కాదు..ఏ మైండ్ సెట్ లో పెరిగాడు అన్నది ముఖ్యం.ఎలాంటి స్కిల్స్ నేర్చుకున్నాడు అన్నది ఒక మనిషి జీవితాన్ని ఏ స్థాయికి 

తీసుకెళ్లాలి అన్నది డిసైడ్ చేస్తుంది.మన బ్యాక్ గ్రౌండ్, మనం పుట్టిన ప్లేస్ గురించి కూడా మనకు ఒక గర్వం ఉండాలి. 

ఒకవైపు టెక్నాలజీ రంగం అద్భుతంగా దూసుకువెళ్తూ.. మనం ఊహించని ఎన్నో రకాలైన సౌకర్యాలను మనకు అందిస్తుంటే.. మనుషులు ఎన్నో రకాలైన మైండ్ బ్లాక్స్ పెట్టుకుని జీవితాన్నే కాదు తమ అస్తిత్వాన్ని కూడా పరిపూర్ణంగా ఆస్వాదించలేక పోతున్నారు. అసలు మన జీవితాన్ని ఆస్వాదించడం అంటే.. మొదట మన అస్తిత్వాన్ని ఆస్వాదించడమే.. కానీ రక రకాల స్థాయి బేధాలు,అంతరాల నుంచి మన ఆత్మ కు విముక్తి కలిగించడమే నిజమైన స్వేచ్ఛ అంటే..తమ స్వార్థంతో,అహంకారంతో.. మనలో స్థాయి బేధాలు కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండటమే మనం చేయాల్సింది.తమ స్థానం విలువ కోసం ఎదుటి వారిని అకారణంగా వేధించే మనుషుల వల్లనే.. మనుషులందరికీ ఒకరంటే ఒకరికి ఆత్మ న్యూనత లేకపోతే అసూయ ఏర్పడుతున్నాయి.ఆత్మ సంతృప్తితో బ్రతకడం కూడా చాలా ముఖ్యమైనది అనే సత్యాన్ని మరిచిపోయి..ధనం కోసం వెంపర్లాడటం వలన మనం మన గొప్పతనాన్ని అనుభూతి చెందలేకపోతున్నాం. మనుషులుగా మనకు ఉన్న విలువను గుర్తించలేకపోతున్నాం. మనలోపల ఏదో ఒక శూన్యాన్ని క్రియేట్ చేసుకుని.. ఆ శూన్యాన్ని పోగొట్టుకునేందుకు సినిమా ,మందు ఇంకా ఎన్నో రకాలైన అనవసరమైన విధానాలను వెతుక్కుని మనలో ఉన్న ఒక గొప్ప వ్యక్తిని మనమే దూరం చేసుకునే పరిస్థితిని మనం తెచ్చుకోకూడదు. 

అత్యున్నత  భావాల సంపదతో పరిపూర్ణ  హృదయ వికాసం:  

“ నిన్ను నువ్వు సమాజానికి నిరూపించుకోవడం కోసం బ్రతికితే.. ఆ విజయం తన ఒకడికే ఉపయోగం. సమాజానికి మేలు చేయడం కోసమే  నువ్వు విజేతగా ఎదిగితే.. ఆ విజయం ఒక ప్రవహిస్తున్న నది లాంటిది, ఒక మహా వృక్షం లాంటిది. నువ్వు ఒక అలాంటి మహా వృక్షం కనుక ప్రపంచం నీ నీడలో సేద తీరడానికి తపిస్తుంది ”

మనలో అనుకున్నంత కీర్తి, గౌరవం సాధించలేకపోతున్నామే అన్న అసంతృప్తి,అనుకున్నంత సంపాదించలేకపోతున్నామనే ఒత్తిడి మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు. అది మన అంతరంగంలో అలజడికి కారణం అవుతుంది. ఆ అలజడి ఏదో మన అభివృద్ధికి ఉపయోగపడని పనిలో ఆనందాన్ని పొందేలా చేస్తుంది. 

మన ఎమోషనల్ ఎనర్జీ ని   మన మానసిక,ఆధ్యాత్మిక అభివృద్ధికి,ఆత్మ వికాసానికి దోహద పడే పనులలో .. ఇన్వెస్ట్ చేయాలి. సద్గ్రంధ పఠనం, ధ్యానం,భక్తి లలో  మనసుని ఆస్వాదించేలా చేయాలి..అనవసరమైన పనులను ఆస్వాదించడం మాని వేయాలి. సినిమాల ద్వారా ప్రచారం అవుతున్న దృశ్యాల  రొమాంటిసిజం చూసి.. అవి నిజమని అనుకోకూడదు. మానసిక నిపుణుల విశ్లేషణ ప్రకారం,మనిషిలో  శృంగార ఆలోచనలకు ప్రధాన కారణం తన కోరికలపై నియంత్రణ లేకపోవడం కాదు.. తనలోని వివిధ రకాల అసంతృప్తి ఒత్తిడుల వలన కలిగిన అలజడి మూలంగా.. ఏర్పడిన ఒక శూన్యం అని తేల్చి చెప్పారు. తమలోని అలజడులను ఎదుర్కోవడానికి చిత్రలేఖనం,కవిత్వం,సంగీతం వంటి సృజనాత్మక మార్గాలు ఉన్నాయి.కానీ అతి జాగ్రత్తగా మనలో ఉన్న శూన్యాన్ని క్లియర్ చేసుకోవాలి మరియు సృజనాత్మకమైన ఆనందాల ద్వారా మనలోని అలజడులను పోగొట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. 

హృదయ పరిశుద్ధత, ఆత్మ శుద్ధికి నిరంతర సాధనే మార్గం:

ఎంత గొప్ప దైవత్వం జన్మత: కలిగిన వ్యక్తికి అయినా.. సాధన కావాలి. ఆధ్యాత్మిక సాధనలు ప్రతి నిత్యం ఆచరించే వ్యక్తులకు బ్రహ్మచర్యమే కాదు.. సమస్తమూ  సాధ్యమే..”

ఆధ్యాత్మిక గురువుగా ఉండాలంటే.. అస్కలిత బ్రహ్మచారిగా ఉండాలనే సంప్రదాయ ఆధ్యాత్మికతకు ఓషో ఆధ్యాత్మికత వ్యతిరేకం. అయినా ఆయన రాసిన పుస్తకాలు,ప్రసంగాలు నేటికీ ఆధ్యాత్మిక సాధకులకు,తత్వవేత్తలకు దారి దీపాలుగా ఉన్నాయి. ఆయన విషయం ఏది చెప్పినా ఆయన అంతరార్ధాలు,ఉద్ధేశాలు ఎల్లప్పుడూ మంచివిగానే ఉండేవి.ఆయన మాటల్లో ఉదాత్తమైన భావాలు, ఉన్నతమైన ఆలోచనలు  పరోక్షంగా ధ్వనించేవి.

భారతీయ ఆధ్యాత్మిక విధానంలో  గృహస్తుగా ఉంటూ కూడా సాధకుడుగా ఉండవచ్చు అనే నియమాన్ని శ్రీ వీరబ్రహ్మంగారు అనుసరించారు.ఆధ్యాత్మిక సాధన అనేది మన సోల్ సెట్ ని మెరుగు పరచుకోవడానికి ఉపయోగ పడుతుంది అంటే.. సర్ఫేస్ లెవెల్ నుంచి కాకుండా  రూట్ లెవెల్ లోనే మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకుని.. ఉత్కృష్టమైన కార్యాలలో ఆనందాన్ని పొంది మన హృదయాన్ని,ఆత్మను శుద్ధి చేసుకోవచ్చు.ఇంద్రియ విషయాలలో ఆనందాన్ని పొందటం అనేది తగ్గించుకుని అటు సృజనాత్మకత కలిగిన హాబీలు ,కళల లోనూ.. ఇటు భక్తి,ధ్యాన సాధన లోనూ,జ్ఞాన సముపార్జన లోనూ రసానుభూతిని పొందటం చాలా ముఖ్యమైనది.

సత్య వస్తువులో ఆనందం – నిజ సుఖాన్వేషణ :

“ వివేకవంతుడికి వైరాగ్యమే సుఖం. భక్తుడికి భగవంతుడి స్మరణలోనే సుఖం. జ్ఞానికి సత్ గ్రంధ  పఠనంలోనే సుఖం. యోగికి ధ్యానంలోనే సుఖం. కవికి అనుభూతులలోనే సుఖం,మేధావికి ఆలోచనలోనే సుఖం ,సత్యాన్వేషకుడికి సత్ వస్తువులోనే,తత్వ వివేచనలోనే  సుఖం ”

ఒక తాగుబోతు మందులేకపోతే.. జీవితంలో అసలు ఎంజాయ్ మెంటే లేదంటాడు. తాగని వాళ్ళని చూసి జాలి పడతాడు. అయ్యో పాపం ! జీవితంలో ఇతను నేను పొందిన కనీస ఆనందాన్ని పొందలేకపోతున్నాడు పాపం అనుకుంటాడు.సంసారంలో ఉన్నవాడు సన్యాసంలో ఉన్నవాడిని చూసి ఇంకా ఆజన్మ బ్రహ్మచారిని చూసి సుఖాలను కాల దన్నుకున్న వారి మానసికస్థితులపై జాలి పడతాడు. వాడు  అవి ఎడారిలో ఎండమావులలాగా కనిపించే ప్రాపంచిక భ్రాంతి సుఖాలని తెలుసుకున్న జ్ఞానులని మర్చిపోతాడు.వారు సత్య వస్తువులలో ఆనందాన్ని పొందడానికి మార్గం చూపే సద్గురువులని గుర్తించాలి,ప్రాపంచిక వ్యామోహాల రోగం పట్టుకున్న మనల్ని కాపాడే భవరోగ వైద్యరాజులు అని గుర్తించాలి.అసలు ఈ మానసిక జాడ్యం మనకు ఎందుకు అంటుకుంది అంటే -  సినిమాలు ,ప్రకటనలు మనకు తెలియకుండానే మనల్ని ,మన అనుభూతుల్ని నియంత్రిస్తున్నాయి. మన సద్భుద్ధిని మరింత పెంపొందించుకుని మన మనసును సద్భుద్ధి తో మార్గదర్శనం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా మనసుకు అంటిన కల్మషాలను ప్రక్షాళన చేసుకోవచ్చు.నువ్వు నిజంగా వివేకవంతుడివి అయితే.. నీకు తప్పకుండా వైరాగ్యంలోనే సుఖం దొరుకుతుంది.  వైరాగ్యంలో నీకు సుఖం దొరకటం లేదంటే.. నువ్వు నిజంగా వివేకవంతుడివి కాదన్నమాట.నీలోని వివేకం పరిపక్వ స్థితిని పొందితే.. వివేకంతో ఆలోచించడంలో , నిర్ణయాలు తీసుకోవడంలో నువ్వు పరిపూర్ణతను సాధిస్తే.. 

సహజాతంగా నీకు వైరాగ్యంలో సుఖం దొరుకుతుంది. మనందరికీ లాజిక్ లతో ఆలోచించడం , ప్రాక్టికల్ గా ఆలోచించడం అలవాటు. వివేకంతో ఆలోచించడం అంటే నిత్యా అనిత్య వస్తు విచక్షణతో ఆలోచించడం. శాశ్వత – అశాశ్వత ఆనందాలలో మనకు ఎంచుకునే అవకాశం ఉన్నప్పుడు వివేకంతో ఆలోచించ గలిగితే.. శాశ్వత ఆనందాన్ని ఎంచుకుంటాము. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే..అశాశ్వత ఆనందాలను ఎంచుకుంటాం. మనం వివేకంతో ఆలోచించాలా,ప్రాక్టికల్ గా ఆలోచించాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి.ఎన్నో లాజిక్ లేని విషయాలను ఓపెన్ గా మాట్లాడలేము. కొన్నిటిలో అద్భుతాలు ఉంటాయి.కొందరు మనుషులు అతీంద్రియ శక్తులతో జన్మిస్తారు అనే విషయాన్ని లాజిక్ తో ఆలోచించి.. కొట్టి పారేస్తాము.అద్భుతాలు అనేవి మానవ ఊహకు అందనివి.. సృష్టి యొక్క తెలివి ముందు ఏ మానవుడి మేధ అయినా ఏపాటిది? కొందరు మనుషులు తమలోని సూపర్ నేచురల్ సామర్థ్యాలను వెలికితీయగలుగుతారు, సిక్త్ సెన్స్ ను ఆక్టివేట్ చేసుకోగలుగుతారు  అనే విషయం కూడా మనం నమ్మలేము. మరీ ఇంత లాజిక్ గా ఆలోచించేవాళ్ళకు ఎవరైనా ఏమని సమాధానం చెప్తారు. వారు పరిపూర్ణ వివేకం కలిగే విధంగా తమ ప్రజ్ఞను పెంపొందించుకోకుండానే..సిద్ధిని సాధించుకుని ఉంటారు లేదా జన్మత: వారికి కొన్ని సిద్ధులు ఉండి ఉంటాయి దాన్ని సరైన దిశలో తీసుకెళ్ళే విధంగా.. వారు వైరాగ్యాన్ని పెంపొందించుకునే ప్రజ్ఞను  స్వాధ్యాయం ద్వారా , ఆరా క్లియరింగ్ చేసే  ఆధ్యాత్మిక సాధనలను క్రమం తప్పకుండా చేయకపోవడమే అసలు సమస్య. సదాచారాన్ని పాటించడం,సత్ శాస్త్రాలను అభ్యసించడం, సత్ సాంగత్యంలో  ఎల్లప్పుడూ ఉండటం అనేవి  శమ – దమాదులను సాధించేలా చేస్తాయి.శమ – దమాదులను సాధిస్తే.. ఆధ్యాత్మిక సాధనలో సగం విజయం వరించినట్టే..ఆధ్యాత్మిక మార్గం అనేది రహదారిలో చేసే ప్రయాణం అనుకుంటారు కానీ అది దైర్యంతో కొత్త మార్గాలను అన్వేషిస్తూ సాగే విజయ పథం అని కొందరికే తెలుసు.

దైవ బలం విధి రాతను మారుస్తుంది :

“ జీవితంలో దేన్ని సృష్టించాలి , ఏమి జరగాలి ఎలాంటి వ్యక్తులను మన జీవితంలోకి ఆకర్షించాలి అన్నది కాన్షియస్ గా నిర్ణయించుకోగలుగుతూ ఉన్నాము అంటే.. మనకు ఖచ్చితంగా దైవబలం తోడున్నట్టే అని విశ్వసించవచ్చు .. విధి రాతను విశ్వసించకుండా మన తలరాతను మనమే రాసుకునే స్థాయికి ఎదిగినట్టే.. కానీ అదంతా మనం దేవుని ఆశీర్వాదం గానే భావించాలి. దేవుని సేవకులుగానే జీవించాలి ”

దైవ బలం – మనిషికి సద్బుద్ధిని కలిగించి సన్మార్గంలో నడిచేలా చేస్తుంది. ఏదైతే  ఇంద్రియ నిగ్రహాన్ని,మనో నిగ్రహాన్ని పెంపొందిస్తుందో అదే సన్మార్గం. ఆ  దైవ బలాన్ని పెంపొందించుకోవడానికి కొంత మంది 41 రోజులు మాల వేసుకుంటారు. శుచి,శుభ్రత పాటిస్తారు,మాంసానికి ,మద్యానికి దూరంగా ఉంటారు. బ్రహ్మ చర్యం పాటిస్తారు,ఇష్ట దైవం యొక్క మంత్రాన్ని శ్రద్ధతో జపిస్తారు,భజనలు చేస్తారు,భగవత్ సమర్పితమైన ఆహారాన్ని భుజిస్తారు. దాని వలన వారి మనసులు చంచలత్వం నుండి మరలి మానసిక స్థిరత ఏర్పడుతుంది. ఒక డివోషనల్ పర్సనాలిటీ గా పరివర్తన చెందుతారు.దానికి తగిన వస్త్ర ధారణ చేస్తారు. నుదుటన ఇష్ట దైవం యొక్క తిలకాన్ని,జపమాలలను ధరిస్తారు. భగవంతునిపై  భారం వేయడం వలన మానసిక ఆందోళనల నుంచి ,ఒత్తిడుల నుంచి ఉపశమనం పొంది.. చేయవలసిన ప్రయత్నాన్ని శ్రద్ధా సక్తులతో నిర్వహిస్తారు. గొప్ప ప్రయత్నాలే గొప్ప విజయాలకు మూలం  కాబట్టి.. మానసిక సమతుల్యంతో ,సంతులతతో ,పరిపూర్ణంగా మనసు పెట్టి చేసిన అలాంటి పనులు సత్ఫలితాలను అందిస్తాయి, వారిని గొప్ప వ్యక్తులుగా సమాజంలో నిలబెడతాయి.

డివోషనల్ పర్సనాలిటీలో ఉండటం అంటే.. చిత్త శుద్ధిని కలిగి ఉండటం. ఇష్టదైవ నామ స్మరణ , మంత్ర జపం, సంకీర్తనం - హృదయాన్ని భగవదోన్ముఖం చేసి భగవంతుని ఆశీర్వాదాలను అందుకునేందుకు వీలుగా మన హృదయాన్ని సిద్ధం చేసుకోవడమే..మనసుకు పట్టిన వ్యామోహాల చిత్త వృత్తుల మకిలిని వదిలించుకుని వైరాగ్య చిత్తులం కావడమే..


Comments

Popular posts from this blog

2. ఆధ్యాత్మికతే – విజయానికి రాజ మార్గం

      ఆధ్యాత్మికతే – విజయానికి రాజ మార్గం  బ్రహ్మ జ్ఞానమే మానవ జాతికి రక్ష:  “ సద్గుణాలే అసలైన ధనం, గొప్ప అలవాట్లే.. నిజమైన సంపద ” మానవ జాతిని పట్టి పీడిస్తున్న ఎన్నో చెడు వ్యసనాలకు ఆధ్యాత్మికత ఒక అత్యద్భుత  పరిష్కారం.నాస్తికవాదులు,హేతువాదులు నిజాలు చెప్తున్నామని ప్రకటించుకుంటూ  నేటి తరానికి అన్యాయం చేయాలని చూస్తున్నారు. ప్రస్తుత తరంలో ఎన్ని ఆవిష్కరణలు ఉన్నాయో.. అంతకు మించి ఆకర్షణలు ఉన్నాయి.ఇలాంటి తరానికి హిందూ మతం,  సంస్కృతి,ఆధ్యాత్మికత ఒక రక్షణ కవచంలా కాపాడే అవకాశం ఉంది. మనుషుల  స్వీయ నియంత్రణను,బలహీనతలను  టార్గెట్ చేస్తూ.. కోట్లాది రూపాయల వ్యాపారం  జరుగుతోంది.ఇలాంటి తరుణంలో .. ఆధ్యాత్మిక జ్ఞానం,భక్తి సంస్కారం మనుషులను జితేంద్రియులుగా,స్వాధ్యాయంతో సదభ్యాసపరులు గా మారుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  పురుషులందు పుణ్య పురుషులు వేరయా: “ బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు” అని ఎవరు అన్నారో కానీ, అతనికి ఖచ్చితంగా జితేంద్రియత్వం ఎలా సాధించాలో తెలిసి ఉండదు. ఒక మనిషి కామాన్ని జయించగలిగితేనే అతడు నిజంగా పుణ్య పురుషుడు అని అర్ధ...

3.నీ విలువ నువ్వు తెలుసుకో

                 నీ విలువ నువ్వు   తెలుసుకో   ఎంటర్ ప్రెన్యురియల్ స్పిరిట్ ను మేల్కొలుపు:   “ఎంత గొప్పస్థాయి వాళ్ళు అయినా నీతో పరిచయం కావాలి అనుకునేంత విలువైన వాడివి అయి ఉండు,నీతో స్నేహం చేయాలనుకునేంత గొప్పవాడివై ఉండు ” ఏదైనా సాధించాలన్నా తపన ఉండాలి . అది సాధించేవరకు మనిషికి సంతృప్తి ఉండకూడదు . సాధించిన తరువాత అందులో కిక్ లభించాలి . అందులో ఆనందం లభించాలి . విజయం సాధించడంలో కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా   సాధించడమనేది కార్యసాధకుని లక్షణం . ఒక కార్యసాధకుని వ్యక్తిత్వాన్ని బాగా ఒంట పట్టించుకోవాలి . అంకితభావం , పట్టుదల , క్రమ శిక్షణ , దైర్యం , ఆత్మ విశ్వాసం , సాహసం వంటి అద్భుతమైన లక్షణాలతో ఒక దాని తరువాత ఒకటి లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధిస్తూ .. అందులో అమితమైన ఆనందాన్ని పొందగలగాలి . ఒక ఎంటర్ ప్రెన్యూర్ లా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి . ఈ ప్రపంచంలో ఎంటర్ ప్రెన్యూర్ అంటే ఒక రియల్ హీరో . ఎంతో దైర్య సాహసాలతో ఎంతో రిస్క్ తీసుకుని ఎన్ని సమస్యలతో అయినా పో...