Skip to main content

2. ఆధ్యాత్మికతే – విజయానికి రాజ మార్గం

    ఆధ్యాత్మికతే – విజయానికి రాజ మార్గం 

బ్రహ్మ జ్ఞానమే మానవ జాతికి రక్ష: 

“ సద్గుణాలే అసలైన ధనం, గొప్ప అలవాట్లే.. నిజమైన సంపద ”

మానవ జాతిని పట్టి పీడిస్తున్న ఎన్నో చెడు వ్యసనాలకు ఆధ్యాత్మికత ఒక అత్యద్భుత 

పరిష్కారం.నాస్తికవాదులు,హేతువాదులు నిజాలు చెప్తున్నామని ప్రకటించుకుంటూ 

నేటి తరానికి అన్యాయం చేయాలని చూస్తున్నారు. ప్రస్తుత తరంలో ఎన్ని ఆవిష్కరణలు ఉన్నాయో.. అంతకు మించి ఆకర్షణలు ఉన్నాయి.ఇలాంటి తరానికి హిందూ మతం, 

సంస్కృతి,ఆధ్యాత్మికత ఒక రక్షణ కవచంలా కాపాడే అవకాశం ఉంది. మనుషుల 

స్వీయ నియంత్రణను,బలహీనతలను  టార్గెట్ చేస్తూ.. కోట్లాది రూపాయల వ్యాపారం 

జరుగుతోంది.ఇలాంటి తరుణంలో .. ఆధ్యాత్మిక జ్ఞానం,భక్తి సంస్కారం మనుషులను జితేంద్రియులుగా,స్వాధ్యాయంతో సదభ్యాసపరులు గా మారుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

పురుషులందు పుణ్య పురుషులు వేరయా:

“ బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు” అని ఎవరు అన్నారో కానీ, అతనికి ఖచ్చితంగా జితేంద్రియత్వం ఎలా సాధించాలో తెలిసి ఉండదు.

ఒక మనిషి కామాన్ని జయించగలిగితేనే అతడు నిజంగా పుణ్య పురుషుడు అని అర్ధం. ప్రతి చిన్న గెలుపు నుంచి.. ఒక మహా గెలుపు సాధ్యం.పది సార్లు టెంప్టేషన్ నిగ్రహించుకోగలిగిన వాడికి  పదకొండో సారి అది మరింత సులువు అవుతుంది. పది సార్లు టెంప్టేషన్ నిగ్రహించుకోలేనివాడికి పదకొండో సారి నుంచి అది ఒక బలహీనత అవుతుంది. అది కామమైన ,కోపమైన..అసూయైన..అహంకారమైన..మరే స్వభావమైన..ఆవగింజ అంత ఉన్నప్పుడే బలహీనతగా మారే స్వభావాలను పరివర్తింప చేసుకుని.. మానసికంగా మహా బలవంతుడుగా మారాలి. 

మహా బలవంతుడుగా బ్రతికే వాళ్ళు నిజంగా ఎంత అదృష్ట వంతులో కదా..అసలు వాళ్ళలో ఏ చిన్న సంఘర్షణ లేకుండానే.. వాళ్ళు ఎలా ఉన్నత వ్యక్తిత్వాన్ని ఆచరణలో చూపిస్తారో..కొంత మంది అయితే ఉన్నత వ్యక్తిత్వాన్ని ఆచరణలో చూపడానికి వాళ్ళతో వాళ్ళు యుద్ధాలే చేస్తారు. 

నిత్యం వాళ్ళతో వాళ్ళే పోరాటం చేస్తూ..వాళ్ళలోని అవగుణాల్ని అధిగమించడానికి ప్రయత్నిస్తూ..అందులో ఒక్కోసారి ఒడిపోతూ.. అప్పుడప్పుడు గెలుస్తూ.. ఎంత సమయాన్ని వృధా చేసుకుంటారు. సమయం ,మానసిక వనరుల విలువ తెలుసుకుంటే..జీవితం మరింత సఫలీకృతమవుతుంది.అలాంటి అవకాశం కలగాలంటే..జీవితం నుంచి అన్ని రకాల బలహీనతలను మైనస్ చేయాలి ఇంకా మరిన్ని బలాలను ఆడ్  చేసుకోవాలి.

నీ హృదయం యుద్ధభూమిలా ఉండకూడదు.. నీ మనసు ఒక శాంతి వనంలా వికసించాలి. నీ ఆలోచన, మాట, పని అన్నీ కూడా నీలోని శాంతి నుంచి మాత్రమే ప్రకాశించాలి. నిర్మోహత్వం,నిష్కామత్వం,  నిరహంకారత్వం,నిష్కల్మషత్వం,నిష్కళంకత్వం నీ సహజమైన ఖచ్చితమైన స్వభావమై ఉండాలి. 

మధురానుభూతులు కోరుకునేదే మనసు:

“ మనసుకు పండగ అంటే.. కాలాన్ని దండగ చేసేది కాదు..ఉన్నతమైన అభిరుచులను ఆస్వాదించడమే అసలైన పండగ ”

మనిషి రోబో కాదు అతడికి మనసు ఉంది. అప్పుడప్పుడు అయినా ఆ మనసుకు మధురానుభూతులు  కావాలి. ఆ మధురానుభూతి కలిగిన రోజే మనసుకు పండగ రోజు. ధనవంతులకు, భాగ్య వంతులకు ఆనందం ఎల్లప్పుడూ కష్టం,బాధ ఎప్పుడో ఒకప్పుడు కలుగుతూ ఉంటాయి.కానీ ఒక సామాన్యుడైన  మనిషి జీవితాంతం వెంపర్లాడేది ఆ మధురానుభూతుల కోసమే. స్నేహంలో,ప్రేమలో,పెళ్ళిలో.. విజయంలో, కీర్తిలో మనిషి ఒకానొక సంతోషపు  స్వర్గంలో తేలియాడాలి అని జీవితాంతం కష్టపడి పని చేస్తాడు.

ఉన్నత భావాలను పెంచి పోషించుకోవడం చాలా అవసరం. వీలైతే..భావాన్ని రస స్థాయికి తీసుకెళ్లడం ఉన్నతమైన జీవితానికి దోహదం చేస్తుంది. నగ్న దేహాలను చూసి ఆనందించే చిత్త ప్రవృత్తిని స్వస్తి చెప్పి.. భగవంతుని రూపాన్ని,నామాన్ని, గుణ-గణాలను గానం చేస్తూ.. భక్తి భావాలనుంచి.. భక్తి రసాస్వాదన చేసే స్థాయికి ఎదగడం వల్లనే చాలా మంది గొప్పవాళ్ళు కాగలిగారు. ఉదాహరణకు అన్నమయ్య,పోతన లాంటి వారు ఆ కోవకు చెందిన వారు. చాలా సార్లు మన ఆలోచనల పట్ల జాగ్రత్త వహించినంతగా..మన భావాల పట్ల జాగరూకులం అయి ఉండము. 

హృదయంలో దాగి ఉండి కలవరపెడుతున్న మనం అంతగా పట్టించుకోని భావాలను..ఎరుకలోకి తీసుకు వచ్చి.. ఆందోళనలను,అశాంతిని,అసంతృప్తిని కలిగిస్తున్న ప్రతి భావాన్ని తొలగించుకోవాలి. మీ అంతరాలలో దాగి ఉన్న జ్ఞాపకాల గాయాలను వెలికితీసి..మీ హృదయానికి సాంత్వన నిచ్చే  లేపనాలను రాసుకోవాలి. పెదవులపై చిరునవ్వు కాదు.. మీ హృదయానికి కూడా గుండె లోతుల్లోంచి స్వచ్ఛంగా నవ్వే అవకాశాన్ని కలిగించుకోవాలి. ఒత్తిడిని జయించగలిగి,సంతోషంగా ఉండగలిగే 

మనిషి – గొప్ప అలవాట్లు పాటించగలిగే.. మానసిక స్థితిలో ఉంటాడు.

యోగులు కావాలని కలలు కనే కొందరు నిరంతరం ఆత్మ గురించే ఆలోచిస్తూ.. ఆత్మానుసంధానం కోసం ప్రయత్నిస్తూ.. ఆత్మానందం కోసం పరితపిస్తుంటారు.మనసును అంతర్ముఖం చేసి కొన్ని సార్లయినా ఆత్మానందం పొందుతూ ఉంటారు. అలా నిత్య ముక్తమై,నిర్మలమైన ఆత్మనే ధ్యానిస్తూ ఆనందం  పొందే వారు నిరంతరం ఆత్మానుభూతి రసాస్వాదన చేసి.. అన్ని అదృష్టాలను అందుకుంటారు. జ్ఞానులుగా ఎదగాలి అనుకునే కొందరు ఆసక్తితో..అనురక్తితో..   గ్రంధాలను అధ్యయనం చేయడం ద్వారా.. వారిలోని జిజ్ఞాసకు నిరంతరం ఆజ్యం పోస్తూ.. హృదయానికి గ్రంధ పఠనంతో అపరిమిత ఆనందాన్ని కలిగిస్తారు

శత్రు వర్గమో..మిత్ర వర్గమో తెలియనీకుండా చేసే యుద్ధం:

“ చెడు వ్యసనాల వైపు లాగాలని ప్రయత్నించే ఎవడైనా శత్రువే.” 

నువ్వు శాస్త్ర సమ్మతమైన పనులు – పుణ్య కర్మలు చేస్తూ ఉంటే.. నిన్ను పాప కూపం లోకి లాగాలని ప్రయత్నించే ఎవడైనా వాడు బద్ధ శత్రువుతో సమానం.

సహజంగా మనుషుల్ని రెండు వర్గాలుగా విభజించవచ్చు. ఒకటి మిత్ర వర్గం మనుషులు. రెండు : శత్రు వర్గం మనుషులు. మిత్ర వర్గం మనుషులతో మీకెలాంటి ప్రమాదం లేదు. వారు మంచివారు.. సహానుభూతి కలిగి ఉంటారు. మీ మనసు తెలుసుకుని ప్రవర్తిస్తుంటారు. వాళ్ళలో మీ పట్ల ఈర్ష్య ద్వేషాలు, అసూయఅహంకారాలు ఉండవు. మీరు ఎదగాలని వాళ్ళు మనస్పూర్తిగా కోరుకుంటారు. పైగా మీరు జీవితంలో ఎదుగుతున్న ప్రతి సందర్భాన్ని వాళ్ళు సెలెబ్రేట్ చేసుకుంటారు. 

శత్రు వర్గం మనుషులలో చాలా మందిని మీరు ఇట్టే గుర్తు పట్టేస్తారు. మీ భావోద్వేగాల గురించి వాళ్ళు పట్టించుకోరు.మీరున్న పరిస్థితుల గురించి వాళ్ళకు ఆలోచన ఉండదు.ఎదుటివారు ఎలాంటి వారు అన్న విషయాన్ని చాలా సార్లు వాళ్ళు పట్టించుకోరు. ఇలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ వలన మీ మనశ్శాంతి, ఆనందం చెడిపోకుండా చూసుకోవాలి. మీ విషయాలను తెలుసుకుని.. సమాజంలో మీ పేరును చెడగొట్టడానికి.. మీకు వ్యతిరేకంగా మీరు చెప్పిన వాటినే వాడే రకం. 

మీ మిత్ర వర్గం ఎవరో.. మీ శత్రు వర్గం ఎవరో.. మీరు ఖచ్చితంగా గుర్తించగలిగితే..ఎవరితో ఎలా ఉండాలో.. ఎలా మీ మనశ్శాంతిని,ఆనందాన్ని కాపాడుకోవాలో తెలుసుకోవచ్చు.

స్వాధ్యాయమే..భవ రోగానికి చికిత్స :

“బ్రహ్మ చర్యమే.. అత్యున్నత నియమం ఎవడు జితేంద్రియుడో వాడు దైవంతో సమానం”

హిందూ మతంలో – బ్రహ్మచర్యాన్ని సాధించడానికి – శమ దమాది షట్క సంపత్తిని ప్రతిపాదించారు. అవి శమ,దమ,ఉపరతి,తితీక్ష,శ్రద్ధ,సమాధానం. 

దమం అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహం  ,   శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. బాహ్య ఇంద్రియ నిగ్రహానికి అత్యుత్తమ ఉదాహరణ – తాబేలు. తాబేలు మీద ఏదైనా తాకినట్టు అనిపిస్తే.. అది వెంటనే దాని చేతులు - కాళ్ళను లోపలికి ముడుచుకుంటుంది.మనిషి కూడా ఏదైనా చూడకూడనిది చూడవలసి వచ్చినపుడు తన ఇంద్రియాలను వాటిని చూడకుండా దృష్టి మళ్లించుకోవాలి. ఏదైనా వినకూడనిది వినవలసి వచ్చినపుడు వినకుండా ధ్యాసను మళ్లించుకోవాలి. చూడకూడనిది చూడటం అంటే.. మనసును ఆకర్షించేది ఏదైనా సరే.. అది మీ  లక్ష్యానికి,విలువలకు విరుద్దమైనది అయితే..దానిని చూడకుండా ఉండవలసిన బాధ్యత ఉంది. మీ లక్ష్యానికి విరుద్దమైన ఆసక్తులు కానీ,ఇష్టాలు కానీ ఒకవేళ ఉంటే.. వాటిని పూర్తిగా మార్చుకోవాలి.మీ లక్ష్యానికి సంబంధించిన ఆసక్తులు,ఇష్టాలు మరియు అలవాట్లు ఉండేలా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. 

శమం ఒక వేళ పొరపాటున దమం బ్రేక్ చేసిన కూడా దమం తప్పకుండా పాటించేలా చూసుకోవాలి. ఒక రాజమహలుకు బయట ద్వారం నుంచి ఒకవేళ దొంగలు ఎవరైనా వచ్చినా – లోపలి ద్వారం దగ్గర సరైన బందోబస్తు.. సరైన సైనికులు ఉంటే..ఎవరూ ఏమీ చేయలేరు.అదే విధంగా దమం ఒకవేళ పొరపాటున పాటించకపోయినా.. శమం అయినా సరిగ్గా పాటించగలిగితే.. ఇంద్రియ మోహాల నుంచి తప్పించుకోవచ్చు. మన ఇంద్రియ వాంఛల రోగానికి పత్యం పాటించినట్లు శమ దమాదులను పాటించాలి. ఆత్మ జ్ఞానం అనే ఔషధాన్ని నిరంతరం సేవించడం ద్వారా జితేంద్రియుడుగా ఎదగవచ్చు.

స్త్రీల పట్ల పురుషులకు ఆకర్షణ కలగడానికి వారి వేషధారణ కూడా కారణం కావచ్చు.  ఒకరి శరీరం పట్ల ఆకర్షణ కొంత కాలం మాత్రమే ఉంటుంది. కానీ ఎదుటివారి మనసు తెలుసుకుంటే..ఆ ఆకర్షణ జీవితాంతం ఉంటుంది. మనస్తత్వం ద్వారా కలిగే ఆకర్షణ – శాశ్వతంగా నిలిచి ఉంటుంది.మీ టేస్ట్ ను ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా..మీలో ఉన్న అన్ని బలహీనతలను శాశ్వతంగా అధిగమించవచ్చు. రోగికి  ఔషధం ఎంతో భవరోగంతో బాధపడే వారికి ఔషధం, ఇంజక్షన్లు అవసరమే..స్వాధ్యాయమే భవరోగానికి పరమౌషధం. భక్తి,నిష్కామ కర్మ అనేవి ఇంజక్షన్లుగా పని చేస్తాయి. అప్పుడు మన మనసుకు మాత్రమే కాదు మన ఆత్మకు కూడా వైద్యం జరుగుతుంది. ఆత్మలో పాపపు రాశిని సమూలంగా తొలగించి.. పుణ్య రాశిని పెంపొందించగలిగే.. ఆత్మ ప్రక్షాళన జరుగుతుంది. ఆత్మ ఉద్దరణ కూడా జరుగుతుంది.


Comments

Popular posts from this blog

3.నీ విలువ నువ్వు తెలుసుకో

                 నీ విలువ నువ్వు   తెలుసుకో   ఎంటర్ ప్రెన్యురియల్ స్పిరిట్ ను మేల్కొలుపు:   “ఎంత గొప్పస్థాయి వాళ్ళు అయినా నీతో పరిచయం కావాలి అనుకునేంత విలువైన వాడివి అయి ఉండు,నీతో స్నేహం చేయాలనుకునేంత గొప్పవాడివై ఉండు ” ఏదైనా సాధించాలన్నా తపన ఉండాలి . అది సాధించేవరకు మనిషికి సంతృప్తి ఉండకూడదు . సాధించిన తరువాత అందులో కిక్ లభించాలి . అందులో ఆనందం లభించాలి . విజయం సాధించడంలో కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా   సాధించడమనేది కార్యసాధకుని లక్షణం . ఒక కార్యసాధకుని వ్యక్తిత్వాన్ని బాగా ఒంట పట్టించుకోవాలి . అంకితభావం , పట్టుదల , క్రమ శిక్షణ , దైర్యం , ఆత్మ విశ్వాసం , సాహసం వంటి అద్భుతమైన లక్షణాలతో ఒక దాని తరువాత ఒకటి లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధిస్తూ .. అందులో అమితమైన ఆనందాన్ని పొందగలగాలి . ఒక ఎంటర్ ప్రెన్యూర్ లా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి . ఈ ప్రపంచంలో ఎంటర్ ప్రెన్యూర్ అంటే ఒక రియల్ హీరో . ఎంతో దైర్య సాహసాలతో ఎంతో రిస్క్ తీసుకుని ఎన్ని సమస్యలతో అయినా పో...

1. ఒక మహోన్నత విశ్వ విజేత

                 ఒక మహోన్నత విశ్వ విజేత  నువ్వు గొప్పవాడివి అని నువ్వైనా నమ్ము : “ప్రపంచం నువ్వు గొప్పవాడివి అయ్యాకనే గుర్తిస్తుంది.కానీ ఈ ప్రపంచం గుర్తించక ముందే నీకు తెలుసు – నువ్వు ఖచ్చితంగా గొప్పవాడివి  అని ” ఈ ప్రపంచంలో నువ్వు రెండు చేయగలవు – ఒకటి నువ్వు విలువైన వాడివని నీకు నువ్వు నిరూపించుకోవడం , నువ్వు విలువైన వాడివని ఇతరులకు నిరూపించడం.  నువ్వు విలువైన వాడివని నిన్ను నువ్వు నమ్మించుకోవడం అంటే – నీ సెల్ఫ్ వర్త్ ని నీ దృష్టిలో పెంచుకోవడం. నువ్వు విలువైన వాడివని ఇతరులను నిరూపించడం అంటే.. నీ నెట్ వర్త్ ని పెంచుకోవడం. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి.. నీ సెల్ఫ్ ఎస్టీమ్ ఆధారంగా నువ్వు గొప్పవాడివని.. నువ్వు నమ్మవచ్చు. కానీ ప్రపంచం మాత్రం నీ సక్సెస్ ని చూసి మాత్రమే నువ్వు గొప్పవాడివని,విలువైన వాడివి అని నమ్ముతుంది. అసూయ ,ఆత్మన్యూనత లేనిదే నిజమైన జీవితం : “ నువ్వు గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే.. నీ గొప్పతనాన్ని చూసి అసూయపడే వారి నుంచి బయటకు రావాలి. నీ గొప్పతనాన్ని గుర్తించి,గౌరవించే సర్కిల్ లో నువ్వు ఉండాలి.” ఒకటి – నువ్వు ఒకడిని చూసి అస...